ఉద్రిక్తతల మధ్య సాగిన బండి సంజయ్ నల్గొండ టూర్

బిజెపి – తెరాస ల మధ్య వరి కొనుగోలు గొడవ రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. మీరు కొనాలంటే..మీరు కొనాలని ఒకరి ఫై ఒకరు విమర్శలు , నినాదాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. సాయంత్రం చిల్లేపల్లిలో దగ్గర ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బండి సంజయ్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన కాన్వాయ్‌ను చిల్లేపల్లి నుంచి పోలీసులు తరలించారు.

మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెంలో రెండుచోట్ల భాజపా-తెరాస శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ముందుగా నల్గొండలో ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌లో సంజయ్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ తెరాస శ్రేణులు నల్లజెండాలతో ‘బండి సంజయ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెరాస-భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఉద్రిక్త వాతావరణం నడుమే బండి సంజయ్ ధాన్యం రాశులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెరాస కార్యకర్తలు రైతుల్లా వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని నిలదీశారు.

రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటానన్న తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఎందుకు కొనడంలేదో చెప్పాలన్నారు బండి సంజయ్‌. కల్లాల్లోకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పలేదా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా కొనడం లేదన్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా…. ఆ నెపాన్ని కేంద్రం మీదకు నెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తక్షణమే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.