రాజగోపాల్ రెడ్డి రాకపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీ లో వెళ్తారనే వార్తలు గత కొద్దీ రోజులుగా రాజకీయాల్లో చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బిజెపి ఎమ్మెల్యే లు రాజగోపాల్ రెడ్డి రాకపై క్లారిటీ ఇవ్వగా..తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం క్లారిటీ ఇచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా బిజెపిలోకి వస్తారని తెలిపారు.

కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారని అన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు వరదలతో సతమతమవుతుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా ని కలిసింది వాస్తవమేనని.. తప్పకుండా బిజెపిలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. నల్గొండ నుంచి చాలామంది బిజెపిలో చేరబోతున్నారని చెప్పుకొచ్చారు. బయట సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గంలో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే పక్షంలో గతంలో హుజురాబాద్ మాదిరే మునుగోడుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో చేరాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది.