ఇదంతా కేసీఆర్ ఆడిన డ్రామా – బండి సంజయ్

అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసేందుకు బిజెపి ట్రై చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లతో పీఠాధిపతి రామచంద్రభారతి, బీజేపీ నేత నందకుమార్, సింహయాజులు బేరసారాలు ఆడుతుండగా..పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లే సమాచారం ఇచ్చారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కు దారితీసింది.

ఈ వ్యవహారం ఫై రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్‌లో, హోటల్‌లో, ప్రగతి భవన్‌లో గత వారం రోజులుగా జరిగిన సన్నివేశాలకు సంబంధించి సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమేలేదని.. ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే.. భార్యాపిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.