కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్ భవన్’ ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదు – బండి సంజయ్

కాంగ్రెస్ ‘చలో రాజ్ భవన్’ ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మీడియాతో మాట్లాడిన సంజయ్..‘‘కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. స్వతంత్ర సమర యోధులు ఏర్పాటు చేసిన దాన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని తెలిపారు.

ఊరికే దొబ్బిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఈడి విచారణ చేయొద్దా.. అక్రమాలు బయటకు వస్తూ కాంగ్రెస్ ను ప్రజలు సమాధి చేస్తారని భయంతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. మోడీ, అమిత్ షా లు కూడా విచారణను ఎదుర్కొని.. నిజాయితీని నిరూపించుకొని బయటకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లాగా విధ్వంసాలకు పాల్పడలేదన్న బండి సంజయ్.. మేము ధర్నాలు చేస్తామంటే ముందస్తు అరెస్ట్​లు చేస్తారు. కాంగ్రెస్ వాళ్లు ధర్నాకు పిలుపునిచ్చినా ఎవ్వరిని ఆపే ప్రయత్నం చేయలేదు. టీఆరఎస్ సౌజన్యంతోనే కాంగ్రెస్‌ విధ్వంసం చేసిందన్నారు.

మరోపక్క టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడిపై ఫైర్ అయ్యారు. ఈడీ నోటీసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని ఎద్దేవా చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ కాలర్ ఎలా పట్టుకుంటారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. ఇక దేశంలో కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది అన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు ఇద్దరు ఐరన్ లెగ్ లని అభివర్ణించారు. వాళ్ళిద్దరూ ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షాలు ఉండవని ఎద్దేవా చేశారు.