వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఘటనపై బండి సంజయ్ ఆగ్రహం

తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలవ్వగా..తాజాగా వరంగల్‌ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్‌ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్‌ అన్నంలోని బల్లిని తీసివేశాడు.

ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్‌ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలి. ఆ బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోందని పేర్కొన్నారు. వరుసగా గురుకులాల్లో ఇలాంటి ఘటనలు ఈ రెండు నెలల్లో చాలా జరిగాయి. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని.. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శలు చేశారు. సీఎం గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చేద్దురు కానీ, ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచించారు.