కేటీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమంపై బండి సంజయ్ ఆగ్రహం

bandi sanjay fire on KTR

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి స్వయంగా కేటీఆర్ పోస్ట్ కార్డు ద్వారా లేఖ రాశారు. జీఎస్టీ విధించడం వల్ల చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశముందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ పోస్ట్ కార్డు ఉత్తరాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. అలాగే ప్రతి ఒక్కరు ప్రధానికి లేఖ రాయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు పంపిస్తున్నారు.

కాగా ఈ ఉద్యమం ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని సంజయ్ ఆరోపించారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు ? అక్కడ సమావేశంలో జీఎస్టీ విధింపుపై మాట్లాడిందెవరో చెప్పాలంటూ బండి సంజయ్ కేటీఆర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా జీఎస్టీ విధింపు విషయంపై కేటీఆర్ గతంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగులను సంజయ్ బయటపెట్టారు. వీడియో క్లిప్పింగ్‌లపై ఏం సమాధానం చెబుతావ్ ? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.

చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని చెప్పి.., ఇప్పుడు ఉద్యమం చేపడతావా ? అంటూ మండిపడ్డారు. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. పచ్చి అబద్దాలతో దొంగ సంతకాలు సృష్టిస్తూ ప్రజల్లో గందరగోళం స్రుష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రాన్ని విమర్శించటం మాని.., చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.