తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్.. శ్రీలంకలా మారుస్తున్నాడంటూ బండి సంజయ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. శ్రీలంకలా మారుస్తున్నాడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం… తానే హింసకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్బంధంపై మేధావులు స్పందించాలన్నారు. పాతబస్తీ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోని కేసీఆర్… ఎంఐఎం సహకారంతో అల్లర్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని… ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే చాలా మంది ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని మతాలు బాగుండాలని బీజేపీ చెప్పే విషయాలు ముస్లింలు కూడా ఆలోచిస్తు న్నారన్నారు.

మరోవైపు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము చేపట్టిన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని అందులో పేర్కొంటూ బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పడు అనుమతి లేదని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్రను నిలిపేశారో ఆధారాలను ఈరోజు సమర్పించాలని ఆదేశించింది.