సీఎం కెసిఆర్ ఎప్పుడైనా జైలుకు పోవచ్చు: సంజయ్

ఎన్ని డ్రామాలాడినా వదిలిపెట్టేది లేదన్న సంజయ్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, సీఎం ఎప్పుడైనా జైలుకు పోవచ్చునని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జైలుకు పంపితే సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే వామపక్షాలు, ఇతర పార్టీల నేతలను ఆయన కలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా కేంద్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇవాళ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వివేకానందుడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పార్టీ ఆఫీసులో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కార్డియాక్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను మొదలుపెట్టిందన్నారు. ‘‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచుకోవడం.. దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా. కేసీఆర్ ఎక్కడున్నా లాక్కొస్తాం. ఫాం హౌస్ లో వెళ్లి పడుకునే నేత దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారు?’’ అని సంజయ్ మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/