ప్రతి గింజను కొంటానని గతంలో కేసీఆర్ అన్నారు: బండి సంజయ్

రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ అక్కడకు రాగానే ‘గోబ్యాక్’ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో వారిపైకి వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఉద్రిక్తతల మధ్యే సంజయ్ ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని గతంలో చెప్పిన కేసీఆర్… ఇప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దసరా కంటే వారం రోజుల ముందే రైతులు ధాన్యం తీసుకొచ్చారని… ఇక్కడ పడిగాపులు పడుతున్నారని అన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా గజినీ వేషాలు మానుకోవాలని… పంట మొత్తాన్ని కొనాలని డిమాండ్ చేశారు. రైతుల్లాగా ఇక్కడకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ చేస్తున్నారని అన్నారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/