యాసంగి ధాన్యం విషయంలో కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా : బండి

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో నీకేంటి ఇబ్బంది?..బండి సంజయ్

bandi-sanjay-comments-on-cm-kcr

న్యూఢిల్లీ : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్.. ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని… రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని… ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు. ”కేసీఆర్… చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో… చేతగాకుంటే ఇంట్లో పడుకో… అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో… లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

”కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్… నీకు వచ్చిన ఇబ్బందేమిటి? అంత అక్కసు ఎందుకు? నీకు నచ్చేది కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా… 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టమేందో తెలుసుకో… కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దలు చూపిస్తవా?” అని బండి సంజయ్ మండిపడ్డారు. “కశ్మీర్ లో జరిగిన దారుణాలు నిజం కాదా? తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే త్వరలోనే రజాకార్ ఫైల్స్, అవినీతి ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీసుకొస్తాం” అని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఉన్నంత జ్ఞానం కూడా కేసీఆర్ కు లేదని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ఇమ్రాన్ ప్రశంసిస్తుంటే… కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో మైండ్ దొబ్బిందని, ఫాంహౌస్ దాటి బయటికి రావడంలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. మోసకారి కేసీఆర్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/