మోడీని ఎదుర్కొనే ముఖం లేకే కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లడం లేదు – బండి సంజయ్

Bandi Sanjay criticisms on KCR
Bandi Sanjay -KCR

ప్రధాని మోడీని ఎదుర్కొనే ముఖం లేకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లడం లేదని విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్కరిస్తున్న‌ట్లు కేసీఆర్ శనివారం మీడియా సమావేశం ఏర్పటు చేసి ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం బాధాక‌ర‌మే అయినా కేంద్రం వైఖ‌రిని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జెప్పేందుకు ఇదే ఉత్త‌మ మార్గ‌మ‌ని భావించామ‌ని ఆయ‌న తెలిపారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోడీకి బ‌హిరంగ లేఖ ద్వారి తెలియ‌జేశామ‌ని కూడా కేసీఆర్ అన్నారు.

ఇదిలా ఉంటె కేసీఆర్ నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోవడం ఫై బండి సంజయ్ పలు విమర్శలు చేసారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏనాడు కేంద్రంలో అధికారిక మీటింగ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపని కేసీఆర్, తన రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసమో.. లేదంటే డాక్టర్ల వద్ద చికిత్స కోసమో మాత్రమే ఢిల్లీ వెళ్లారని శనివారం సంజయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

ప్రజల సంక్షేమం కోసం చర్చించేందుకు ఏనాడైనా ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కోరినంత డబ్బులు ఇస్తే నీతి ఆయోగ్‌ మంచిది.. లేదంటే మంచిది కాదా అని నిలదీశారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే.. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై అందులోనే మాట్లాడవచ్చు కదా? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చెబుతున్న కేసీఆర్, 5 రోజులు ఢిల్లీలో ఉండి కేంద్రాన్ని బెదిరించి రూ.10 వేలు కోట్లు అప్పు సాధించానని చెబుతున్నారని, మరి కేంద్రం నిజంగా డబ్బులివ్వకపోతే ఏడాది నుంచి ఏం చేసినట్లని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం రూ.5 వేల కోట్ల కంటే ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ ముందు కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా? అని నిలదీశారు.