టీడీపీ తో పొత్తు ఫై బండి సంజయ్ స్పష్టత..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా ఆవిర్భవించి దేశంలో చక్రం తిప్పాలని చూస్తుంటే…రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి చూస్తుంది. ఇదే క్రమంలో పొత్తుల వ్యవహారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి – టిడిపీ పొత్తు ఖాయమనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

టీడీపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్ లలో టీడీపీ బహిరంగసభలు జరగనున్న తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు మిషన్ 90 లక్ష్యంగా టీ బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా జరిగిన సమావేశంలో మిషన్ 90పై బ్లాప్రింట్ సిద్దం చేశారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కమలం కార్యాచరణ చేపట్టింది. ‘కేసీఆర్ కో హటావో.. తెలంగాణకో బచావో’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.