అరవింద్ నివాసంపై టిఆర్ఎస్ దాడి పట్ల బండి సంజయ్ ఆగ్రహం

బంజారాహిల్స్ లోని బిజెపి ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అంటూ నిలదీశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నరని…గడీల గూండాల దాడులకు… తోక ఊపులకు భయపడతామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బిజెపి సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు… మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని బండి సంజయ్ హెచ్చరించారు.

మరోపక్క కవిత చేసిన వ్యాఖ్యల ఫై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని, కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. తన ఇంట్లో విధ్వంసం సృష్టించి 70 ఏండ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరల పాలన కాదని అన్నారు.

రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థంచేసుకుంటానని అన్నారు. తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ఆమె ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవిత తన అభ్యర్థనను మన్నించడం ఎంతో సంతోషంగా ఉందన్న అర్వింద్.. ఇప్పటికైనా ఆమె మాటపై నిలబడాలని ఆకాంక్షించారు. 2024 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.