క్రిమినల్స్ కు హైదరాబాద్ అడ్డగా మారింది – బండి సంజయ్

క్రిమినల్స్ కు హైదరాబాద్ అడ్డగా మారిందన్నారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం ఘటన ఫై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. గత నెల 28న (మే 28న) అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో నిందితుల పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధితురాలు నిందితుల పేర్లు చెప్పినా ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదన్నారు. నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రజాప్రతినిధుల పిల్లలపై ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ కేసు విషయంలో నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేసిన బీజేపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదని, క్రిమినల్స్ కు, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసుతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయని ఆరోపించారు.

మరోపక్క ఈ ఘటన ఫై రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ స్పందించారు. నిందితుల‌ను క‌చ్చితంగా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని అన్నారు. హోదాతో సంబంధంలేకుండా నిందితుల‌ను శిక్షించాల‌ని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మ‌హ‌మూద్ అలీ స్పందించారు. ఇది దారుణ‌మైన ఘ‌ట‌న అని మ‌హ‌మూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. నిందితులు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌బోమ‌న్నారు. వారి నేప‌థ్యంతో సంబంధం లేకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.