కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ‌

రైతుల కంట క‌న్నీరు… మీ ఫామ్‌హౌస్ పంట ప‌న్నీరు.. బండి సంజ‌య్

హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ గురువారం సీఎం కేసీఆర్‌కు ఓ బ‌హిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై టీఆర్ఎస్ స‌ర్కారు నిర్ల‌క్ష్యం, రైతాంగానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న స‌హ‌కారం.. త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ లేఖ రాశారు. ఈ లేఖ‌లో కేసీఆర్ స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రైతుల కంట క‌న్నీరు ఒలుకుతుంటే… కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మాత్రం ప‌న్నీరు ఒలుకుతోంద‌ని ఆయ‌న సెటైరిక్ కామెంట్లు కూడా సంధించారు.

రైతులకు పంట‌ల పెట్టుబ‌డి కింద కేసీఆర్ స‌ర్కారు ప్ర‌కటించిన రైతు బంధు ప‌థ‌కం నిధులు స‌కాలంలో విడుద‌ల కాలేద‌ని బండి సంజయ్ ఆరోపించారు. స‌కాలంలో అంద‌ని రైతు బంధు వ‌ల్ల లాభ‌మేమిట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోకి రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశించిన విష‌యాన్ని గుర్తు చేసిన సంజ‌య్‌… చాలా మంది రైతులు దుక్కులు దున్ని విత్త‌నం వేసేందుకు స‌న్నాహాలు చేసుకున్నార‌ని తెలిపారు. అయితే పెట్టుబ‌డికి డ‌బ్బుల్లేక రైతు బంధు నిధుల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించి త‌క్ష‌ణ‌మే రైతు బంధు కింద విడుద‌ల చేయాల్సిన రూ.7,500 కోట్ల‌ను నిధుల‌ను త‌క్ష‌ణ‌మే రైతుల ఖాతాల్లో జ‌మ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

2018 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు త‌క్ష‌ణ‌మే రైతుల‌కు రూ.1ల‌క్ష మేర రుణ‌మాఫీని అమ‌లు చేయాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ రుణ‌మాఫీ అమ‌లు కాని నేప‌థ్యంలో రైతులు ఆ రుణాల‌కు వ‌డ్డీల మీద వడ్డీలు క‌డుతూ ఇప్ప‌టికే చితికిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా రైతు బంధు నిధుల‌ను స‌కాలంలో విడుద‌ల చేయ‌క‌పోతే… మ‌రోమారు రైతులు ప్రైవేట్ వ‌డ్డీ వ్యాపారుల‌ను ఆశ్ర‌యించి మ‌రింత మేర అప్పుల్లో కూరుకుపోతార‌ని సంజ‌య్ పేర్కొన్నారు. రుణ మాఫీ, రైతు బంధు నిధుల విడుద‌ల‌తో రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

రైతుల సంక్షేమం కోసం కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కృషి చేస్తోంద‌ని బండి సంజ‌య్ తెలిపారు. ఖ‌రీఫ్ ప్రారంభమ‌వుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే కిసాన్ స‌మ్మాన్ కింద ఇచ్చే నిధుల‌ను మోదీ స‌ర్కారు రైతుల ఖాతాల్లో జ‌మ చేసింద‌న్నారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర‌కు రైతుల పొలాల్లో ఏ పంట వేస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని రైతుల‌కు చెప్పేందుకు మోడీ స‌ర్కారు దేశ‌వ్యాప్తంగా సాయిల్ హెల్త్ కార్డుల‌ను మంజూరు చేసింద‌ని ఆయ‌న చెప్పారు. అయితే కేసీఆర్ స‌ర్కారు స‌హ‌కారం లేని కార‌ణంగా తెలంగాణ రైతాంగానికి ఇప్ప‌టికీ సాయిల్ హెల్త్ కార్డులు అంద‌లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.