జులై 5న శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం

Balkampet Yellamma ammavaru
Balkampet Yellamma ammavaru

హైదరాబాద్: శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఈ సంవత్సరం జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఈ సంవత్సరం జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కళ్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో 2.5 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయించాలని, దేవాలయంలో ప్రస్తుతం ఉన్న రుద్రాక్ష మండపం చెక్క పై వెండి తొడుగులతో ఉందని, దాని స్థానంలో నూతనంగా రాతి రుద్రాక్ష మండపం ఏర్పాటుచేసి బంగారు తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా ఆలయంలోని పోచమ్మ, నాగదేవత అమ్మవారి ఆలయ దర్వాజలు, తలుపులు, రాజగోపురం వద్ద గల దర్వాజ కు వెండి తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అమ్మవారి కళ్యాణం నిర్వహించే విగ్రహం చిన్నదిగా ఉన్నదని, 5 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో తమిళనాడులోని కుంభకోణం నుండి తెప్పించనున్నట్లు కమిటీ సభ్యులు, అధికారులు తెలపగా, అమ్మవారి కళ్యాణం నాటికి పెద్దసైజు విగ్రహాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/