రాజగోపాల్‌ రెడ్డిలా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాదు – బాల్క సుమన్

మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ పొలిటికల్ బాంబు పేలింది. అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసేందుకు బిజెపి ట్రై చేయగా..వారి ప్లాన్ రివర్స్ అయ్యింది. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన కొనుగోలు వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం పట్ల ఎమ్మెల్యే బాల్క సుమన్‌ బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వందల కోట్ల రూపాయలిచ్చి, కాంట్రాక్టులిచ్చి, పదవులు ఎరవేస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంగట్లో అమ్ముడుపోయే సరుకులు కాదని అన్నారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులిచ్చి రాజగోపాల్‌రెడ్డి లాంటి నాయకులను కొనుక్కోవచ్చని, దమ్మున్న తెలంగాణ ఉద్యమకారులైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ కూడా చేయలేరని సుమన్ అన్నారు.

కేంద్రంలోని పెద్ద మనుషులకు సంబంధించిన సింహయాజులు, రామచంద్రభారతి, నందకుమార్‌ అనే ముగ్గురు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.100కోట్లకు పైగా నగదు, కోట్లాది రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు, పదవులు ఎరగా చూపి.. టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.. పోలీసులకు అందజేశారు. ఇవాళ రెడ్‌ హ్యాండెడ్‌గా వీరిని పట్టుకోవడం జరిగింది’ అని సుమన్ మీడియా తో అన్నారు.