ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలోనూ వైస్సార్సీపీ దే గెలుపు

లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటు: మంత్రి బాలినేని

అమరావతి: ఏపీ వ్యాప్తంగా జరుగనున్న మునిసిపల్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కుప్పం ఎన్నికలు ఒక ఎత్తుగా మారిపోయాయి. కుప్పంలో ప్రస్తుత వాతావరణం వాడివేడిగా ఉంది. గెలుపుపై అధికార, ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుప్పంలో ఓటు అడిగే హక్కు వైస్సార్సీపీకి లేదని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఇప్పటికే వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు లోకేశ్‌పై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. తాజాగా మంత్రి బాలినేని కూడా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

ప్రతిపక్షం ఎన్నికుట్రలు చేసినా కుప్పంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్‌లో వైస్సార్సీపీ విజయం పక్కా అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కుప్పంలోనూ టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటన్నారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్ర‌బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పం మునిసిపాలిటీని అభివృద్ధి చేసిన ఘతన సీఎం జగన్ కె దక్కుతుందని బాలినేని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/