చీకోటి ప్రవీణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు – వైస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు వైస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.
చీకోటి ప్రవీణ్‌ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. సాధారణ పేకాట స్థావరాలను నడిపించే ప్రవీణ్..ఇప్పుడు దేశ , విదేశాల్లో క్యాసినోలను నిర్వహించే స్థాయికి చేరాడు. అతి కొద్దీ ఏళ్లలోనే వందల కోట్లను సంపాదించాడు. దీంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఇదిలా ఉంటె చికోటి ప్రవీణ్ కు వైస్సార్సీపీ నేతలకు సంబంధం ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురి పేర్లు బయటకు రావడంతో వారు స్పందిస్తున్నారు.

తాజాగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి క్యాసినోలపై , చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలపై క్లారిటీ ఇచ్చారు. చీకోటీ ప్రవీణ్‌ ఎవరో తనకు తెలియదని.. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను అప్పుడప్పుడు క్యాసినోలకు వెళ్లి పేకాట ఆడుతుంటానని ఒప్పుకున్న బాలినేని.. ప్రవీణ్‌తో గానీ, అతడు చేసే హవాలా స్కామ్‌లతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే తప్పని ఒప్పుకునే ధైర్యం తనకుందని.. కానీ చేయని తప్పుకు తనపై ఆరోపణలు చేస్తుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.