టీడీపీ నేత‌లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు: మంత్రి బాలినేని

బలవంతంగా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్ వ‌సూలు చేస్తున్నార‌ని లోకేశ్ ఆరోప‌ణ‌లు

అమరావతి: వైస్సార్సీపీ ప్రభుత్వం బలవంతంగా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్) వ‌సూలు చేస్తోంద‌ని టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏపీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్ పై ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. శుక్రవారం బాలినేని ప్ర‌కాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు అసత్యాలను ఎలా చెబుతారో లోకేశ్ కూడా అదే రీతిలో అస‌త్యాలు చెబుతున్నారని ఆయ‌న ఆరోపించారు.

రాష్ట్రంలో స్వచ్చందంగా ముందుకు వచ్చే వారి నుంచే ఓటీఎస్ తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జగన్ చెబితే, దానిపై టీడీపీ నేత‌లు అసత్య ప్రచారాలు చేస్తున్నార‌ని, ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు. అసలు పద్నాలుగు ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఏం చేశారో చెప్పాలని ఆయ‌న నిల‌దీశారు.

2014 ఎన్నికలకు ముందు చంద్ర‌బాబు నాయుడు వంద‌లాది హామీలు ఇచ్చార‌ని, వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాగా, ఓటీఎస్ ఓ మంచి అవ‌కాశ‌మ‌ని, దాన్ని వాడుకోవాలా? వ‌ద్దా? అనేది ల‌బ్ధిదారుల ఇష్ట‌మ‌ని జ‌గ‌న్ కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/