రూ.24.60లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ.24.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి వేలాన్ని రూ.1,11,116ల నుంచి నిర్వాహకులు వేలంపాట ప్రారంభించగా అనేక మంది పోటీపడ్డారు. ఈ క్రమంలో పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

గతేడాది కంటే రూ.5.70లక్షల ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. గతేడాది కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17.60లక్షలకు బాలాపూర్‌ గణేశుడి లడ్డూను దక్కించుకోగా 2020లో కరోనా కారణంగా వేలంపాట నిర్వహించలేదు. 2021లో లడ్డూను దక్కించుకున్న శశాంక్ రెడ్డి 2019లో కంటే రూ.1.30లక్షల ఎక్కువగా రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరిమాణంలో ఖైరతాబాద్ గణపతి అందరికంటే మిన్న అనిపించుకుంటే, బాలాపూర్ లో గణేశుడి లడ్డూ వేలం పాటకు అదేస్థాయి విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డూకు రికార్డు స్థాయిలో ధర పలుకుతూవస్తోంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. మొదట్లో ఇక్కడి లడ్డూ కేవలం రూ.450 ధర పలికింది. ఆ తర్వాత లక్షలకు చేరింది.