ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

నరసరావు పేట వైస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కు హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని సినిమా రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం లో నందమూరి బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్‌ చేశారు. ఇంతలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి.. భాస్కరరెడ్డిని మందలించారు. దీంతో భాస్కర్ రెడ్డి మనస్తాపానికి గురై ఎమ్మెల్యే ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు, కార్యకర్తలు భాస్కరరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు భాస్కరరెడ్డిని ఇంటికి తరలించారు. బాలకృష్ణ పాట పెట్టినందుకే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయం బాలకృష్ణ దృష్టికి వెళ్ళింది. దీంతో తాజాగా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బాలకృష్ణ సదరు ఎమ్మెల్యే కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు.