హీరోగా పరిచయమవుతున్న నందమూరి చైతన్య కృష్ణ

నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా పరిచయం కాగా..ఇప్పుడు మరోవారసుడు వస్తున్నాడు. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఇటీవల ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పుడీ సంస్థ.. జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘రక్ష’, ‘జక్కన్న’ ఫేం దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు జయకృష్ణ తెలిపారు.