రేపే బద్వేల్ ఎన్నికల నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అయితే రేపు (అక్టోబర్ 1) బద్వేలు అసెంబ్లీ స్థానం ఉప-ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలిపి షాక్ ఇచ్చారు.

కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పటుచేసారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ.. ఈవీఎంల ద్వారా ఉప-ఎన్నిక పోలింగ్ జరగనుందని తెలిపారు. శుక్రవారం బద్వేలు ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుందని.. అక్టోబరు 1 నుంచి బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు, 1,08,799 మంది పురుషులు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు వెయ్యి మందికి అనుమతించబోమన్నారు.

వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య డా.సుధ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఓబుళాపురం రాజశేఖర్‌ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం జనసేనతో చర్చించి అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో పడింది.