రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బడంగ్‌పేట మేయర్ దంపతులు

టిఆర్ఎస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. బడంగ్‌పేట మేయర్ దంపతులు ఈరోజు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మే నెలలో మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితోపాటు ఆమె భర్త, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బడంగ్‌పేట మేయర్ దంపతులు సైతం అదే బాటలో నడిచారు. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో సమావేశమయ్యారు. కేసీఆర్ సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారంతా తమ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌తో కలిసి పని చేస్తే ప్రజాసమ్యలను పరిష్కరించలేని పరిస్థితులు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులపాలైందని, రాష్ట్రం దివాళా తీసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెచ్చుకోవచ్చని రేవంత్ వ్యాఖ్యానించారు. 2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా పారిజాత విజయం సాధించారు. అప్పట్లో పారిజాతకు మేయర్‌ పదవి ఇచ్చేలా ఒప్పందం జరగడంతో ఆమె టీఆరఎస్ లో చేరారు. మేయర్‌ పదవి దక్కించుకున్నారు. కొంతకాలంగా పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరుల వద్ద వాపోతూ వచ్చారు. ఇక ఇప్పుడు టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.