ఇక బాబు కుప్పం నియోజకవర్గాన్ని మరచిపోవడమే మంచిదా..?

ఇన్నాళ్లూ చంద్రబాబు ఏ ప్రాంతాన్ని తన కంచుకోటగా భావించారో, ఏ ప్రాంతంలో తనకు తిరుగులేదని అన్నారో, ఏ ప్రాంతం ప్రజలు తనకు బ్రహ్మరథం కడతారని భ్రమించారో.. ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. కుప్పం మున్సిపాలిటీ ప్రజలు బాబు ను ఘోరంగా ఓడించారు. అలా అని ఇదేదో గట్టిగా పోరాడి ఓడిన రాజకీయ యుద్ధం కాదు. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిన సందర్భం. 2019లో ఏపీ ప్రజలు బాబుకు బై చెబితే.. ఈసారి కుప్పం ప్రజలు ఏకంగా చంద్రబాబు రాజకీయ జీవితానికే గుడ్ బై చెప్పారు. ఈ ఫలితాలతో ఆయన మరో నియోజకవర్గం వెదుక్కుంటారా లేక ఇప్పట్నుంచి కష్టపడి కుప్పంలోనే తన పట్టు నిలుపుకుంటారా అనేది ప్రధాన ప్రశ్నగా నిలిచింది.
నిజానికి కుప్పంలో చంద్రబాబు తన పట్టుకోల్పోవడానికి ఆయన స్వీయ తప్పిదాలు మాత్రమే కారణం కాదు, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని దీనికి అది పెద్ద కారణంగా చెప్పుకోవాలి. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కుప్పంను ఒకేలా చూశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అంటే ఏంటో చూపించింది. మరీ ముఖ్యంగా రెండున్నరేళ్లుగా కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్షేమ ఫలాల్ని కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అందుకే కుప్పం ప్రజలు బాబు కు బై బై చెప్పి వైసీపీ కి జై జై లు కొట్టారు.