దావోస్ ఎందుకు డ‌బ్బు దండ‌గ అన్నారుగా? : అయ్య‌న్న‌పాత్రుడు

మ‌రి ఏ ముఖం పెట్టుకుని జ‌గ‌న్ దావోస్ వెళ్లారని ప్రశ్న

అమరావతి : సీఎం జగన్ దావోస్‌లో వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ నేత‌లు వ‌రుస‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌య‌మూ విదిత‌మే. ఇందులో భాగంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఓ ట్వీట్ సంధించారు. వైస్సార్సీపీ ఎంపీ వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డిని కోట్ చేస్తూ సాగిన ఆ ట్వీట్‌లో టీడీపీ హ‌యాంలో ఏపీకి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లెన్ని? వాటి ద్వారా రాష్ట్ర యువ‌త‌కు అందిన ఉద్యోగాలెన్ని? అన్న వివ‌రాల‌ను అయ్య‌న్న వెల్ల‌డించారు.

చంద్రబాబు గారు, లోకేశ్ దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో ఓపికగా లెక్కేసుకోవాలంటూ సాయిరెడ్డికి సూచించిన అయ్య‌న్న‌… అందుకు అవ‌స‌ర‌మ‌య్యే కాలిక్యులేటర్ ఫ్రీగా పంపుతానంటూ సెటైర్ సంధించారు. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల వివరాలు వైస్సార్సీపీ ప్రభుత్వమే బయట పెట్టిందన్న అయ్య‌న్న‌.. బహుశా విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి మీరు చూడ‌లేద‌నుకుంటాన‌ని ఎద్దేవా చేశారు.

భారీ, మధ్య, చిన్న తరహా అన్నీ కలిపి రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు వ‌చ్చాయ‌న్న అయ్య‌న్న‌… వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా వైస్సార్సీపీ ప్రభుత్వమే ఈ వివ‌రాల‌ను ప్రకటించింద‌ని అయ్య‌న్న గుర్తు చేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని దావోస్ వెళ్ళారని ప్ర‌శ్నించిన అయ్య‌న్న‌.. సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్ కి ప్రత్యేక విమానంలో వెళ్ళిన సంగతీ తేల్చాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌ సంగతి మీరు మూడేళ్ల నుంచి తేలుస్తూనే ఉన్నారని ఎద్దేవా చేసిన అయ్య‌న్న‌ ఏం పీకారో జనాలు కూడా చూశారంటూ సెటైర్ సంధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/