హైదరాబాద్ కు వెళ్తే ..సీఎం జగన్ అరెస్టే : అయ్యన్నపాత్రుడు

బొత్స మాటలు గందరగోళంలోకి నెట్టివేసేలా ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు

ayyanna patrudu
ayyanna patrudu

అమరావతి: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే అని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసేలా ఉన్నాయని అన్నారు.

హైదరాబాదే ఏపీ రాజధాని అంటున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ కు వెళ్లండి, మీ సీఎంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలిస్తారని అన్నారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని చెప్పి, ఇప్పడు హైదరాబాద్ రాజధాని అని చెప్పడమేంటో అని ఎద్దేవా చేశారు. ఇలాంటి తుగ్లక్ మాటలు మాట్లాడొద్దని సూచించారు. గత నవంబరుకే పోలవరం నుంచి నీళ్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గొప్పగా చెప్పారని… ఇప్పుడు మార్చి నెల గడచిపోతోందని, ఇంతవరకు నీళ్ల జాడ ఏదని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/