సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడిలో అరెస్ట్ అయినా సుబ్బారావు ఫై ప్రశ్నల వర్షం

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి వెనుక అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదురుకుంటున్న సుబ్బారావు ను పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నరసారావు పేట సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి వెనుక అసలు సూత్రధారిగా పోలీసులు నిర్దారించారు. విద్యార్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. శనివారం ఖమ్మం జిల్లాలో ఈయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇవ్వడం జరిగింది. ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్‌లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేయడం జరిగింది.

ప్రస్తుతం సుబ్బారావు పోలిసుల కస్టడీలో ఉన్నారు. రైల్వేస్టేషన్లను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి దీనికి వ్యూహ రచన జరిగింది? దీని వెనక ఇంకెవరు ఉన్నారు? విధ్వంసంలో పాల్గొన్న వారంతా సైనిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నవారేనా? బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంతమంది స్టేషన్‌కు చేరుకోవటానికి ఎలా సమాచారం షేర్‌ చేసుకున్నారు? ఆ ఫోన్లు ఎవరివి? అని సుబ్బారావుకు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తునట్టు సమాచారం.

ఆవుల సుబ్బారావు విషయానికి వస్తే..ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్లకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి అధికారి హోదాలో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. కొంతకాలం గుంటూరులో ఉండి 2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన యువకులకు శిక్షణ ఇస్తుంటారు. కరోనా కారణంగా ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఈఏడాది హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో అకాడమీని ఏర్పాటుచేశారు. ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావటం, ఎంపికల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవటం, నియామకాలు వాయిదా పడటంతో హైదరాబాద్‌ కేంద్రాన్ని మూసేశారు. ఆర్మీ నియామకాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలతో విసిగిపోయిన సుబ్బారావు నిరుద్యోగ యువతతో కలిసి విధ్వంసానికి తెరా తీశారని పోలీసులు అనుమానిస్తున్నారు.