అవినాష్ ముందస్తు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

Avinash’s anticipatory bail hearing adjourned till noon

హైదరాబాద్ః వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం తెలుపుతూ సునీతరెడ్డి వేసిన పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అవినాష్‌కు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆమోదయోగ్యంకాదంటూ సుప్రీం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఈరోజు హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ రాలేదని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డర్ కాపీ అందిన తర్వాత వాదనలు వినిపిస్తామని అవినాష్ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.

కాగా.. గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం తేల్చిచెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ నెలకొంది.