ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి సింధియా ఆకస్మిక తనిఖీ

ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ, ఫిర్యాదుల సమస్య.. విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రి

Aviation minister makes surprise visit to Delhi airport amid chaos, overcrowding complaints

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్నాళ్లుగా విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. వేలాది సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణాలు చేస్తుండటం రద్దీకి ఓ కారణమైతే.. చెకిన్, చెకౌట్ సమయాల్లో విపరీతమైన ఆలస్యం జరగడంపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని ఆకస్మికంగా సందర్శించారు. విమానాశ్రయ అధికారులతో మాట్లాడి, వారికి తగిన సూచనలు చేశారు. కొన్ని రోజుల కిందటే దేశంలోని ప్రధాన విమానాశ్రయాల అధికారులు, మేనేజ్‌మెంట్ బోర్డులతో సింధియా సమావేశమయ్యారు. రద్దీ, సిబ్బంది కొరత కారణంగా జాప్యం జరుగుతోందని పలు ఫిర్యాదులు రావడంతో ఆయన సమావేశం నిర్వహించారు.

మరోవైపు విమానాశ్రయం రద్దీగా ఉండటంతో పాటు, పొడవాటి క్యూల గురించి ఫిర్యాదులు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. విమానం ఎక్కే ముందు క్లియరెన్స్ ప్రాంతంలో రెండు, మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ తక్షణ నివారణ చర్యలుగా అమలు చేయడానికి నాలుగు పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఈ క్రమంలో సింధియా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3ని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో తమ ఇబ్బందులు పరిష్కారం అవుతాయని ప్రయాణికులు భావిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/