ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్‌ గెలుపు పోరాటం

Rafael Nadal
Rafael Nadal

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రపంచ నంబర్‌వన్‌, ‘స్పెయిన్‌ బుల్‌’ రఫెల్‌ నాదల్‌ తీవ్రంగా శ్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిరియోస్‌తో మూడున్నర గంటలకు పైగా పోరాడి చివరికి విజయం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌ 6-3, 3-6, 7-6(8/6), 7-6(7/4) తేడాతో నిక్‌ కిరియోస్‌పై 3గంటల 38 నిమిషాల పాటు పోరాడి గెలిచాడు. తాజా విజయంతో కిరియోస్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్‌ 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్వార్టర్స్‌లో డొమెనిక్‌ థీమ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. మరోవైపు పోటీలు ప్రారంభమయ్యే ముందు హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ (41), ఆయన కుమార్తె గియానా (13) మృతి చెందడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పోటీలు సోమవారం భావోద్వేగాల మధ్య జరిగాయి. నాదల్‌తో పోటీకి దిగే ముందు కోబ్‌కు నివాళిగా లాస్‌ఏంజిల్స్‌ లేకర్స్‌ జెర్సీ వేసుకొని కోర్టులో అడుగు పెట్టిన కిర్గియోస్‌ కన్నీరు పెట్టుకున్నాడు. షాక్‌కు గురయ్యానంటూ నాదల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో బరిలోకి దిగిన అమెరికా యువ సంచలనం కోకొ గాఫ్‌.. తన బూట్లపై రిప్‌ కోబ్‌, రిప్‌ గిగి అని రాసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/