ఎమ్మెల్యే అనుచరుని హత్యకు పథకం!

Attempted Murder
Attempted Murder

వారి నుంచి మారణాయుధాల స్వాధీనం

గుంటూరు: ఎన్నికల సమయం ఆసన్నమైందంటే ఎప్పుడు ,ఎక్కడ ఏం జరగుతుందో తెలియదు. అటు అధికారులు, పోలీసు యంత్రాంగం, ఇటు సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టిడిపి నుంచి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు ముప్పన వెంకటేశ్వర్లును హత్య చేయడానికి ఇద్దరు వ్యక్తులు పథకం తయారుచేసుకున్నట్లు తెలుస్తుంది. వారు మారణాయుధాలతో పోలీసులకు చిక్కడం పల్నాడులో ఆందోళన రేకెత్తించింది. ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే అనుచరుడు వుప్పనను మట్టుబెట్టాలని మాచవరం మండలం గోవిందాపురం, పిడుగురాళ్లకు చెందిన వ్యక్తులు మారణాయుధాలతో జనంలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని పొలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరి వద్ద నుంచి రివాల్వర్లు, మూడు తపంచాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరు ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు, దీని వెనుక ఎవరున్నారు, అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.