యుద్ధ ప్రాంతాలలో చిన్నారులపై పెరిగిన దాడులు

మూడు రెట్లు పెరిగాయని తాజా అధ్యయనంలో వెల్లడి

UN
UN

ఐక్యరాజ్యసమితి: నేటితో ముగుస్తున్న దశాబ్ద కాలంలో ప్రపంచంలో యుద్ధ ప్రాంతాలలో చిన్నారులపై దాడులు మూడు రెట్లు పెరిగాయని ఐరాస నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయింది. ముఖ్యంగా యుద్ధాలలో హత్యలు, లైంగిక దాడులు, అంగవైకల్యానికి గురి చేయటం, కిడ్నాపింగ్‌లు, మానవతా సాయం నిరాకరణ, వెట్టి చాకిరీ, స్కూళ్లు, ఆస్పత్రులపై దాడుల వంటి నేరాలలో చిన్నారులే ఎక్కువగా బలిపశువులవుతున్నారని ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2010 నుండి ఇప్పటి వరకూ దాదాపు 1,70,000కు పైగా తీవ్ర నేరాలు నమోదయినట్లు ఐరాస వెల్లడించింది. అంటే గత దశాబ్ద కాలంలో రోజుకు సగటున 45కు పైగా నేరాలు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగుతూ భారీ రక్తపాతానికి, అనేక మంది మృత్యువాత పడేందుకు దారి తీస్తున్నాయని ఐరాస చిన్నారుల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రియెట్టా ఫోర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ సమయాలలో చిన్నారులపై దాడుల నివారణకు సంబంధిత వర్గాలు చర్యలు తీసుకోవాలన్నది ప్రాథమిక యుద్ధ నీతి అని ఆమె గుర్తు చేశారు. తాము ఈ అధ్యయనంలో గుర్తించినవి కాక, ఇంకా నమోదు కాని నేరాలు అనేక వున్నాయని ఆమె వివరించారు. గత ఏడాది చిన్నారులపై మొత్తం 24 వేల దాడులు జరిగినట్లు తాము గమనించామని, ఇది 2010 నాటి కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని ఆమె అన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/