రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి
తీవ్రంగా గాయపడిన బిగ్‌బాస్3 విజేత రాహుల్ సిప్లిగంజ్

హైదరాబాద్: బిగ్‌బాస్3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరుబాటిళ్లతో దాడి జరిగింది. గత రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో కొందరు యువకులు రాహుల్ తలపై బీరు సీసాలతో దాడికి దిగారు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాహుల్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/