గుజరాత్ అసెంబ్లీ పోలింగ్ : బీజేపీ అభ్యర్థి పియూష్ పటేల్ ఫై దాడి

గుజరాత్ మొదటి దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థి పియూష్ పటేల్ ఫై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ దాడిలో బీజేపీ అభ్యర్థి పీయూష్ పటేల్ తలకు తీవ్రంగా గాయం అయ్యింది. గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పీయూష్‌తో పాటు వచ్చిన 4 నుంచి 5 మంది బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దీంతో పాటు కాన్వాయ్‌లో నడుస్తున్న 3 నుంచి 4 వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పీయూష్ పటేల్ ఎన్నికల ప్రచారంలో వన్స్దా సీటులోని ఝరి గ్రామంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. దీనిపై పోలీసులకు పిర్యాదు చేసారు.

మరోపక్క ఉదయం నుండి పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. తొలిదశలో 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సతీ సమేతంగా నవ్సారీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. నార్త్ జామ్ నగర్ నుంచి పోటీలో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్ కోట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.