మహారాష్ట్రలో ప్రేమ పేరుతో దారుణం

ప్రేమించలేదని కాలేజీ లెక్చరర్‌పై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు

మహరాష్ట్ర: మహారాష్ట్రలో ప్రేమ పేరుతో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కసితో కాలేజీ లెక్చరర్‌పై పట్టపగలు పెట్రోలు పోసి నిప్పంటించాడు. దడోరా గ్రామానికి చెందిన అంకిత పిసుద్దె (25) విదర్భలోని హింఘన్‌ఘాట్ జిల్లా నందోరీ చౌక్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. దడోరా గ్రామానికే చెందిన వికేశ్ (27)కు పెళ్లయింది. ఏడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అంకితతో తనకున్న పరిచయాన్ని అడ్డంపెట్టుకుని ప్రేమించమని వెంటపడేవాడు. అతడి ప్రవర్తన నచ్చని అంకిత రెండేళ్ల క్రితం అతడిని దూరం పెట్టింది. అంకిత తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన వికేశ్ నిన్న ఉదయం కళాశాల వద్ద కాపుకాశాడు. అంకిత బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే బైక్‌పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అంకితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. వివాహమైనా వికేశ్ వేధింపులు ఆపలేదని, గతేడాది ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు.


అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/