ప్రజలను జ‌గ‌న్ తప్పుదారి పట్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు

నిన్న రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలి

అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో సీఎం జగన్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని విమర్శించారు. రైతు భరోసాలో అంకెల గారడీతో రైతుల‌ను జ‌గ‌న్ మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. నిన్న రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నిన్న రైతు భరోసా కింద రూ.30 కోట్లు మాత్రమే విడుద‌ల చేసి రూ.1,213 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రజలను జ‌గ‌న్ తప్పుదారి పట్టిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఒకే ద‌శ‌లో రూ.12,500 ఇస్తామని చెప్పి, ఇప్పుడు 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారని ఆయ‌న విమర్శించారు.

ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జ‌గ‌న్ రైతు వ్యతిరేక విధానాలు అవ‌లంబిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. దీంతో రెండున్నరేళ్లలో సుమారు 1,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల‌ కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున‌ పరిహారం ఇస్తామ‌ని చెప్పి, వారిని మోసం చేశార‌ని తెలిపారు. ఇప్పుడు రైతు తన వడ్డీని బ్యాంకుకు ముందుగానే చెల్లించాల్సి వ‌స్తోంద‌ని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/