వైస్సార్సీపీ గూండాల దాడి.. దారుణం: అచ్చెన్నాయుడు

రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: అచ్చెన్నాయుడు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైస్సార్సీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నివాసంపై వైస్సార్సీపీ గూండాలు దాడికి యత్నించడం దారుణమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. స్వతహాగా ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కలిగిన జగన్… ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేశారని అన్నారు.

వైస్సార్సీపీ ప్రభుత్వ అరాచక పాలనపై మాట్లాడితే తప్పా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను లేవదీస్తే గూండాగిరి చేస్తారా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్లతో దాడి చేస్తారా? అని నిలదీశారు. జోగి రమేశ్ ఎమ్మెల్యేనా లేక గూండానా అని మండిపడ్డారు. దాడిని అడ్డుకోబోయిన టీడీపీ నేతలపై రాళ్లతో దాడి చేయడం అరాచకమని అన్నారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. జోగి రమేశ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని… లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/