సెంటు భూమి పథకం మొత్తం అవినీతే : అచ్చెన్నాయుడు

15 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. జగన్ కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారు: అచ్చెన్నాయుడు

అమరావతి : వైస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో 3.16 లక్షల ఇళ్లను కట్టి 2.62 లక్షల ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రతి ఇంటికి పేదలకు రూ. 5 లక్షలు ఇస్తానని, ప్రతి ఏటా 5 లక్షల ఇళ్లను కడతానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ హామీ ఇచ్చిన మేరకు ఈ మూడేళ్లలో 15 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండగా… ఇప్పటి వరకు కేవలం 5 ఇళ్లను మాత్రమే నిర్మించారని మండిపడ్డారు.

పేదలకు సెంటు భూమి పథకం మొత్తం అవినీతే అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ పథకంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రూ. 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో భూములు ఇచ్చారని అన్నారు. పేదలు ఇళ్లను కట్టుకోలేనంతగా ఇసుక, సిమెంట్ ధరలను పెంచారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడ్డారని మాట్లాడిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గృహనిర్మాణంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/