రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు గెలిచితీరుతాం – అచ్చెన్నాయుడు

రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు గెలిచితీరుతాం అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ మూడేళ్ల పాలన ఫై విమర్శలు చేశారు. మూడేళ్ల జగన్‌ పాలనను రాష్ట్ర ప్రజలు అసహ్యంచుకుంటున్నారని, మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని , పన్నులు, చార్జీలతో ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చారని మండిపడ్డారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పాలనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి అల్లర్లు సృష్టించాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో కుల ఘర్షణలు ఎక్కువయ్యాయని, సొంత బాబాయ్ హత్య కేసులో బాంబులేస్తామని సీబీఐ అధికారులనే బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో 57 శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కానీ వైకాపా 47 శాతం ఖర్చు పెట్టి.. సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలపై సొంత పత్రికకు కోట్లాది ప్రకటనలు ఇస్తూ.. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల డబ్బును దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రివర్స్‌ టెండరింగ్‌ పథకమే రాష్ట్రాన్ని పూర్తిగా రివర్స్‌లోకి తీసుకెళ్లిందని విమర్శించారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు గుత్తేదారులను తప్పించి.. సొంత వ్యక్తులకు వాటిని కట్టబెట్టి.. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. వైస్సార్సీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అనడానికి మహానాడు విజయవంతం కావడమే సంకేతమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి 160 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.