మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. జగన్ కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి – అచ్చెన్నాయుడు

మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. జగన్ కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి చేస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్ ను వైస్సార్సీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు కటౌట్ కు నిప్పంటించారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం కాలింది. ఈ ఘటన పట్ల వైస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బందరు డీఎస్సీ బాషా, పెడన రూరల్ సీఐ ప్రసన్న గౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ ఘటనా స్థలికి చేరుకుని, పరిశీలించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. మూడున్నరేళ్లలో 36 మంది టీడీపీ కుటుంబసభ్యులను పొట్టన పెట్టుకున్నారని.. లక్షలాదిమందిని ఇబ్బందులకు గురి చేసారు. దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేశారు. వైఎస్సార్‌సీపీ దుర్మార్గాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసులు పెట్టకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పోలీసులు.. జగన్ కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల కష్టం, త్యాగాలు వృథాగా పోవు అని , వచ్చే ఎన్నికల్లో 161 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని అన్నారు.