ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..9 మంది మృతి

At least nine Iraqi police officers killed in bomb blast near Kirkuk

బాగ్దాద్ః ఇరాక్‌లో ఆదివారం (డిసెంబర్‌ 18) ఘోర మారణహోమం సంభవించింది. ఐఎస్ ఉగ్రమూక ఇరాక్‌ పోలీస్ పెట్రోలింగ్‌ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసధికారులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కిర్కుక్ సమీపంలోని సఫ్రా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జిహాదీలు ప్రత్యక్ష దాడికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో జరిగిన ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. తొలుత పోలీసు పెట్రోలింగ్‌పై ఐఎస్‌ ఫైటర్లు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఆ తర్వాత మెషిన్ గన్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌లతో వారిపై దాడి చేసినట్లు గ్రూప్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఓ ప్రకటన ద్వారా వెలువరించారు. ఈ దాడిలో ఒక ఐఎస్‌ ఏజెంట్‌ను మట్టుబెట్టినట్లు, మిగిలిన వారికోసం గాలిస్తు్న్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుదానీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘పిరికి ఉగ్రవాద దాడి’గా వ్యాఖ్యానించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, రహదారులను జాగ్రత్తగా గస్తీ కాయాలని, తీవ్రవాదులకు ఎలాంటి అవకాశం కల్పించకూడదని ఆయన సూచనలు జారీ చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రమూకపై చర్యలకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/