అసోంలో వర్ష బీభత్సం…17 మంది మృతి

దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

assam Heavy rains
assam Heavy rains

గువహటి: అసోంలో కురుస్తున్న వర్షాలతో అక్కడ ఉద్ధృతి కొనసాగుతుంది. వరదల ధాటికి బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. బ్రహ్మపుత్ర, సుబాన్‌సిరి, ధన్‌సిరి, జియాభరలి, కొపిలి, ధరామ్‌తుల్‌, పుతీమరి, బేకి, బరాక్‌, బాదర్‌పూర్‌ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గువహటి సహా దాదాపు 33 జిల్లాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4620 గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అసోం ప్రభుత్వం 226 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. లక్షా రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం సైన్యం సహా మరిన్ని సహాయ బృందాలను పంపుతామని తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరకుల అందజేత కోసం రాష్ట్రవ్యాప్తంగా 562 సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సాయంగా అసోం విపత్తు నిర్వహణ సంస్థకు కేంద్రం రూ.251 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సాయం అందుతోందని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/