రామతీర్థంలో ఉద్రిక్తత..అశోక్ గజపతిరాజు అవమానం

విజయనగరం, రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు అవమానం జరిగింది. కొద్ది నెలల క్రితం రామతీర్దం బోడికొండపైన విగ్రహాల ధ్వంసం ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రభుత్వం అక్కడ కొత్తగా రామాలయం శంకుస్థాపనకు నిర్ణయించింది. ఇక, ఈరోజు రామాలయ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ క్రమంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తనకు అవమానం జ‌రిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంతో అశోక్‌గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అశోక్‌గజపతిరాజును తోసేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు.

శంకుస్థాపన శిలాఫలకం పైన ఆయన పేరు చేర్చకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. శిలా ఫలకం బోర్డు ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో..తన అనుచరలతో కలిసి బైఠాయించారు. ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని అశోక్ గజపతి ఆరోపించారు.