రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

92 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

ashok-gahlot-versus-sachin-pilot-political-crisis-continuing-in-rajasthan-congress-party

జైపూర్‌ః రాజస్థాన్ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలన్న దానిపై రాజస్థాన్ కాంగ్రెస్‌ రెండుగా విడిపోయింది. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి పదవి రేసులో సచిన్ పైలట్ ముందున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతుండగా గెహ్లాట్ వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటోంది.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే, అంతకంటే ముందే గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాను కూడా రాజీనామా చేస్తానని పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో స్పందించిన అధిష్ఠానం సీఎల్పీ భేటీని రద్దు చేసింది. సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లిన గెహ్లాట్, పైలట్ సహా అందరినీ ఢిల్లీ రావాలని ఆదేశించింది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి జోడు పదవులు కుదరవని రాహుల్ గాంధీ చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం పీఠం నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. అయితే, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని భావించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుదలగా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/