నెల్లూరు జిల్లాకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిన ‘అసని’ తూఫాన్

‘అసని’ తూఫాన్ ముప్పు ఏపీకి పెద్దగా రాకపోయినప్పటికీ చాల జిల్లాల్లో నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాను తీవ్ర నష్టాల్లోకి తీసుకొచ్చింది. బుధవారం రాత్రి తుఫాన్‌ తీరం దాటినప్పటికీ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం గురువారం నాటికి జిల్లాలో 12,292 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా 10,456 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది.

వరి 795 ఎకరాలు, వేరుశనగ 697 ఎకరాలు, మినుము 230 ఎకరాలు, నువ్వులు 84 ఎకరాలు, మొక్కజొన్న పంట 30 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో కోత కోసి రోడ్లపై ఉంచిన 63 మొట్రిక్‌ టన్నుల ధాన్యపు రాశులు వర్షానికి తడిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఉదయగిరి, వరికుంటపాడు, లింగసముద్రం, గుడ్లూరు, బోగోలు, జలదంకి, వలేటివారిపాలెం, కందుకూరు, సంగం, ఉలవపాడు, పొదలకూరు మండలాల్లో అధిక నష్టం జరిగినట్లు అధికారులు చెపుతున్నారు. వర్షం పూర్తిగా తగ్గితే పూర్తి లెక్క తేలుతుందని అంటున్నారు.