ఏపీలో ‘అసని’ ఎఫెక్ట్ – అధికారులు ముందస్తు జాగ్రత్తలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో ఏపీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేస్తున్నారు.

బుధవారం ఈ తూఫాన్ బలహీనపడే అవకాశం ఉండడం తో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడ రేవులలో 2వ నె౦బర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసామని అధికారులు తెలిపారు. మచిలీపట్నం నుండి చైన్నె వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుందని.. అందుకే ఈదురుగాలులు ఉరుములు మెరుపులుతో కూడిన గాలలు వీస్తున్నాయంటున్నారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచించారు. మొబైల్స్‌కు ఛార్జింగ్ ఉంచుకోవాలని.. ఇంట్లో విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాలంటున్నారు. ఇంటి పైకప్పు మరమ్మత్తులు ఉంటే చేసుకోవాలని సూచించారు.