అంపైర్‌గా రాణింపు

అంపైర్‌గా రాణింపు
Vrunda

క్రికెట్‌ అంటే ఎంతో క్రేజ్‌ ఉన్న ఆట. పరుగులు తీయడం, బాల్‌ విసరడం, బ్యాట్‌తో కొట్టడం అంటే అది మగవారు చేసేదే అనుకుంటాం. కాని క్రికెట్‌లో కూడా యువతులు తమ సత్తా చాటారు. అందులోనే అంపైర్లుగా కూడా తామేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఒకరు వృందా రటి. నవీ ముంబయిలో పుట్టిన వృందా రటి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. ముగ్గురు అబ్బాయిల తరువాత వారికి ఒకతే అమ్మాయి.

వృందాకు చిన్నప్పటి నుండి ఆటలంటే ఎంతో ఆసక్తి. ఎనిమిదో తరగతి నుండే స్నేహితులతో క్రికెట్‌ ఆడేది. డిగ్రీలో చేరిన రెండో సంవత్సరంలో అక్కడి స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడటం ప్రారంభించి ంది. యూని వర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేది. క్రికెట్‌ ఆడుతుండేటప్పుడే అక్కడ స్కోరర్స్‌ను గమనించేది. దాంతో స్కోరర్‌గా పని చేయాలనుకుంది. అందుకోసం బిసిసిఐ నిర్వహించే టెస్ట్‌ రాసి పాసయ్యింది. దాదాపు అయిదేళ్లు స్కోరర్‌గా పనిచేసింది.

మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్‌ పోటీ జరుగుతున్నప్పుడు అందులో తొలిసారి మహిళా అంపైర్‌ని చూసిన వృందా ఆదే తన కెరీర్‌గా ఎంచుకుంది. అంపైర్‌గా పనిచేయడం అనుకున్నంత సులువు కాదు. ఏకాగ్రత, సునిశితమైన దృష్టి ఉండాలి. నిర్ణయం తీసుకునే సామర్ధ్యం ఉండాలి. తప్పు అయినా కూడా వెనక్కి తీసుకోలేని సందర్భాలు ఉంటాయి. అంపైర్‌ కావడానికి కూడా పరీక్షలు ఉంటాయి. వాటిని సాధిస్తేనే అవకాశం వస్తుంది. వృందా ఎంత కష్టమైనా అంపైర్‌ కావాలనే నిర్ణయించుకుంది. పరీక్షలకు సిద్ధమవుతూనే ఫిట్‌నెస్‌ సంస్థలో పనిచేసేది.

స్కోరర్‌గా కూడా ఉండేది. రాత్రి సమయాల్లో చదువుకునేది. అంపైర్‌ ఎంపిక పరీక్షల్లో మొదట లోకల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎంట్రెన్స్‌ రాయాలి. తరువాత బిసిసిఐ నిర్వహించే లెవల్‌ 1, లెవెల్‌ 2, ప్రాక్టికల్‌ పరీక్షలు రాయాలి. వాటిలో ఏ ఒక్కదాంట్లో ఫలితం సాధించకున్నా తిరిగి మొదటి నుండి రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌ పరీక్షల్లో మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాలి.

ఆ సమయంలో ఎగ్జామినర్లు అక్కడే ఉండి గమనిస్తు ఉంటారు. అలా దాదాపు 150 మ్యాచ్‌లకు పనిచేసింది. అంపైర్‌గా అర్హత సాధించినట్లు బిసిసిఐ నుండి సమాచారం అందుకుంది. పాండిచ్చేరిలో నిర్వహించిన మ్యాచ్‌కు పూర్తి స్థాయి అంపైర్‌గా చేసింది. ర్యాంకుల్ని బట్టి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/