నేడు గుజరాత్‌లో ప్రధాన పార్టీల అగ్రనేతల ర్యాలీలు

All-Star Show In Gujarat Today As Top Leaders Of Main Parties To Campaign

అహ్మదాబాద్‌ః గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్‌తో పాటు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప‌లు ప్ర‌చార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దిగ్గ‌జ నేత‌ల రాక‌తో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రింత వేడెక్క‌నుంది.

ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ఆప్ అభ్య‌ర్ధుల త‌ర‌పున అమ్రేలిలో రోడ్‌షోలో పాల్గొన‌నుండ‌గా, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నేడు రాజ్‌కోట్‌, మ‌ధుర‌లో జరిగే ఎన్నిక‌ల ర్యాలీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సురేంద్ర‌న‌గ‌ర్‌, బ‌రుచ్‌, న‌వ్‌సారీల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు. 182 మంది స‌భ్యులు క‌లిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు డిసెంబ‌ర్ 1, డిసెంబ‌ర్ 5న రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క బిజెపి, కాంగ్రెస్‌, ఆప్‌ల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. బిజెపిని మ‌ట్టిక‌రిపించి ఈసారి గుజ‌రాత్‌లో పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌గా, మోడీ, షాల సొంత‌గ‌డ్డ‌లో ఎలాగైనా అధికారం నిలుపుకోవాల‌ని క‌మ‌ల‌నాధులు పావులు క‌దుపుతున్నారు. మ‌రోవైపు ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గుజ‌రాత్‌లోనూ స‌త్తా చాటాల‌ని ఆప్ చెమ‌టోడుస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/